లక్నో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేవలం ఓ వర్గానికి నాయకుడని బీజేపీ మంత్రి రణ్వేంద్ర ప్రతాప్ సింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. అఖిలేష్ ఓ కులానికి నేతగా పరిమితమని, ఆయన రాష్ట్రానికి నాయకత్వం వహించలేడని మంత్రి ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. బీజేపీ ఆ పార్టీ నాయకత్వం మాదిరిగా అఖిలేష్ అన్ని కులాలు, వర్గాలకు చేరువ కాలేరని అన్నారు. అఖిలేష్ లాంటి కుల నేత రాష్ట్రాన్ని నడిపించలేరని ఎద్దేవా చేశారు. ఫతేపూర్ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్ధానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని హుస్సేన్‌గంజ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి రణ్వేంద్ర ప్రతాప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి పునరావృతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మార్చి 10న అందరి జాతకాలు బయటపడతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో లఖింపూర్ ఖేరి ఘటనను విపక్షాలు లేవనెత్తడంపై మంత్రి స్పందిస్తూ లఖింపూర్ ఖేరి ఉదంతం ఎస్పీ హయాంలో చోటుచేసుకున్న ఆర్ధిక నేరాలు, లూటీల వంటి ఘటన కాదని ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం పట్ల ఎస్పీ భాగస్వామ్య పక్షం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి మండిపడ్డారు. బహ్రెక్లో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ సంక్షోభం సమయంలో ధృడమైన నాయకత్వం అవసరమని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలో ఇప్పుడు తీవ్ర అలజడి చూస్తున్నామని..ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ సహా మానవాళి అంతా దృఢంగా నిలబడాలని, ఇప్పుడు మీ ప్రతి ఒక్కరి ఓటు భారత్‌ను బలోపేతం చేస్తుందని మోదీ ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఆపై ఎస్పీ భాగస్వామ్య పక్షం ఆర్ఎల్డీ ఉగ్రవాదుల కొమ్ము కాస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు.
యూపీలో పలు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులపై ఈ పరివార్‌వాదీలు ప్రేమ కురిపిస్తున్నారని ఈ ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడిపించేందుకు వీరు కుట్రపన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉగ్ర సంస్ధలపై నిషేధాన్ని కూడా ఎస్పీ వ్యతిరేకిస్తుందని, 2008 అహ్మదాబాద్ పేలుళ్ల తీర్పుపై వారు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ప్రధాని ప్రకటనపై ఎస్పీ భాగస్వామ్యపక్షమైన ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి భగ్గుమన్నారు. మోదీ ప్రతి అంశాన్నీ తనకు అనుకూలంగా అన్వయించుకుంటారని అన్నారు. ఉక్రెయిన్ను మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారని ఆక్షేపించారు. యూపీ ఓటర్లు విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఆర్ధికాభివృద్ధి, నిరుద్యోగంపై ప్రశ్నించకుండా ఉక్రెయిన్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు. కాగా, ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రయత్నిస్తుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటేందుకు బీఎస్పీ, కాంగ్రెస్‌లు చెమటోడుస్తున్నాయి.