న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా తాయిలాలు ప్రకటించింది. ప్రతి మహిళ, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందచేస్తామని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘాన్ని నియమిస్తామని హామీ ఇవ్వడంతోపాటు చొరబాటుదారుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తామని వాగ్దానం చేసింది.
పోలీసు శాఖసహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ శుక్రవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మ్యానిఫెస్టో విడుదల చేస్తూ ఇది సోనార్ బంగ్లా నిర్మాణం కోసం రోడ్డుమ్యాపుగా అభివర్ణించారు.