బెంగళూరు, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలోకి నడిపించేందుకు అంతా తానే అన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించారు. ఒకవైపు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నా…అవేమీ పట్టించుకోకుండా కర్ణాటకకే ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మోదీ మ్యాజిక్ పని చేయలేదు. ప్రధాని మోదీ కర్ణాటకలో 19 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బెంగళూరులో మూడు, మైసూరు, కలబురగి, హుబ్బళ్లిలో ఒక్కో రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ రోడ్డు షోల కోసం వేలాది మందిని సమీకరించారు. 50 టన్నుల చామంతి, బంతి పూల వర్షాన్ని ఆయనపై కురిపించారు. మండే ఎండలో, సాయంత్రాల్లోనూ దాదాపు 35 గంటల పాటు, సుమారు 125 కిలోమీటర్ల దూరం సాగిన ఆరు రోడ్డు షోలు ఫలితాల సాధనలో విఫలమయ్యాయి.