న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాల ఊపుతో 2019 ఎన్నికలతో పోలిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్ధానాల్లో పోటీ చేయాలని (Target 2024) పాలక బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇక లోక్సభ ఎన్నికలకు కాషాయ పార్టీ జనవరి లేదా ఫిబ్రవరిలో అభ్యర్ధుల జాబితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాధ్ సింగ్ సహా పలువురు అగ్రనేతలకు చోటు కల్పించనుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తొలి జాబితాలో మోదీ, షా, సింగ్ల పేర్లున్నాయి. తొలి జాబితాలో 2019లో బొటాబొటీగా గెలిచిన, గట్టిపోటీతో బయటపడిన 164 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లుండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలపై బీజేపీ గత రెండేండ్లుగా దృష్టి కేంద్రీకరించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతోంది. ఇక గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 543 స్ధానాలకు గాను 436 స్ధానాల్లో పోటీ చేసి 303 స్ధానాల్లో విజయం సాధించింది. 133 స్ధానాల్లో ఓటమి పాలైంది. పార్టీ బలహీనంగా ఉన్న మరో 31 స్ధానాలను గుర్తించిన అగ్ర నాయకత్వం అక్కడ బలపడేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భాగస్వామ్య పార్టీల సంఖ్య తగ్గడంతో 2024 లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లలో పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. గతంలో పంజాబ్లో ఎస్ఏడీ, బిహార్లో జేడీయూ, తమిళనాడులో ఏఐఏడీఎంకే, రాజస్ధాన్లో ఆరెల్పీ వంటి పార్టీలతో పొత్తులో ఉండగా ప్రస్తుతం ఆయా పార్టీలతో బీజేపీ దూరం జరిగింది. దీంతో ఈసారి అధిక సీట్లలో పోటీ చేసి అత్యధిక స్ధానాల్లో విజయం సాధించేందుకు కమలనాధులు కసరత్తు సాగిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 50 శాతం ఓట్లను రాబట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్ధేశించడంతో ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని కార్యాచరణ దిశగా సన్నద్ధం చేశారు.
Read More :