న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుల్లోనే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన కమలం పార్టీ.. 50 స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతున్నది. ఇక అధికార ఆప్ 19 స్థానాలకే పరిమితమవగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్నది.
ఇక ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదినుంచి వెనుకంజలోనే ఉన్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్గ ఆధిక్యం కనబరుస్తున్నారు. అదేవిధంగా కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీపై బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. ఆప్ అభ్యర్థులైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జంగ్పూరలో,సత్యేంద్రకుమార్ జైన్ షాకుర్ బస్తీలో లీడ్‌లోకి వచ్చారు. ఓక్లా స్థానంలో అమానుతుల్లా ఖాన్, గ్రేటర్ కైలాష్‌లో సౌరభ్ భరద్వాజ్ ముందంజలో కొనసాగుతున్నారు. పంత్ నగర్లో అవధ్ ఓజా, బల్లిమారన్ స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్‌పై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బద్లీ స్థానంలో కాంగ్రెస్ క్యాండిడేట్ దేవేంద్ర యాదవ్ వెనుకంజలో ఉండగా, గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ, బిజ్వాసన్‌లో కైలాష్ గెహ్లోత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.