హైదరాబాద్, జూలై 24 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి ధన్‌ఖడ్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందా? మోదీ సంతోషంగా లేరని బీజేపీ పెద్దలు హెచ్చరించినప్పటికీ, ‘తగ్గేదే..లే’ అన్నరీతిలో ధన్‌ఖడ్ ముందుకే వెళ్లారా? ఇది జీర్ణించుకోలేని మోదీ..ధన్‌ఖడ్‌పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారా? దీనికి రాజీనామాతో ధన్‌ఖడ్ దీటైన బదులిచ్చారా? థ్రిల్లర్ సినిమాను తలపించేలా కొనసాగుతున్న జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీస్తున్నది. గడిచిన 11 ఏండ్లు నియంతను తలపించేలా సాగుతున్న మోదీ పాలనకు తొలి ధిక్కారంగా ‘ధన్‌ఖడ్’ ఎపిసోడ్‌ను రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రధాని మోదీతో పొసగకపోవడం వల్లే ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్టు ఇప్పటికే అర్థమయ్యింది. అయితే, రాజీనామాకు ముందు జరిగిన ఓ కీలక ఎపిసోడ్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ గురువారం ఓ కథనంలో వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన చర్యలకు నేతృత్వం వహించాలని అధికార బీజేపీ అనుకొన్నది. ఈ క్రమంలోనే సోమవారం లోక్‌సభలో చర్యలకు ఉపక్రమించింది. అయితే, రాజ్యసభలో విపక్షాలు ఇదే విషయాన్ని తొలుత లేవనెత్తడం, తమతో చర్చించకుండానే ధన్‌ఖడ్ విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మోదీకి రుచించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మోదీ అనుమతి లేకుండా ధన్‌ఖడ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఆరోగ్యమంత్రి, రాజ్యసభ నాయకుడు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ధన్‌ఖడ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి లోక్‌సభలో చర్యలు మొదలుపెట్టామని, దీని పై విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సంతకం చేశారని ధన్‌ఖడ్‌తో రిజిజు అన్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభలో ఇదే అంశాన్ని ప్రాసెస్ చేయడం ఏమిటని? దీనిపై మోదీ ఏమాత్రం సంతోషంగా లేరని రిజిజు.. ధన్‌ఖడ్‌కు చెప్పారు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రిజిజు వ్యాఖ్యలపై స్పందించిన ధన్‌ఖడ్.. సభ నిబంధనలకు లోబడే తాను నడుచుకొంటున్నట్టు చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ భేటీకి ముందు జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి హాజరైన జేపీ నడ్డా, కిరణ్ రిజిజు.. ధన్‌ఖడ్‌తో ఈ వాదన జరిగిన అనంతరం జరిగిన రెండో దఫా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి గైర్హాజరవ్వడం గమనార్హం. ధన్‌ఖడ్ స్పందన తెలుసుకొన్న మోదీ.. ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారని, ఈ క్రమంలోనే ధన్‌ఖడ్ తన రాజీనామాతో మోదీ పరివారానికి గట్టి బదులిచ్చారని ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. కాగా, మోదీ నియంతృత్వ ధోరణికి తన రాజీనామాతో ధన్‌ఖడ్ దీటైన సమాధానం ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉండగా.. వర్మ అభిశంసనపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన నోటీసులతోనే ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
గురువారం రాజ్యసభలో ఏడుగురు సభ్యులతో వీడ్కోలు కార్యక్రమం షెడ్యూలైంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధన్‌ఖడ్‌కు కూడా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందించలేదు. మోదీతో వైరం కారణంగానే.. ధన్‌ఖడ్‌కు బీజేపీ నేతలు ఎటువంటి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఉప రాష్ట్రపతి రేసులో జేడీయూ నేత, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ పేరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. శశిథరూర్, నితీశ్ కుమార్ల పేర్లు కూడా బయటకు వచ్చినప్పటికీ తమ పార్టీకి చెందిన వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయబోతున్నారని బీజేపీ వెల్లడించింది.