న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘కుక్క’ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్లమెంట్‌ను కుదిపేశాయి. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా.. అందుకు ఖర్గే ససేమిరా అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ‘దేశానికి మేం (కాంగ్రెస్) స్వా తంత్య్రం తెచ్చాం. దేశ కోసం మా ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీతోపాటు ఎంతో మం ది నేతలు ప్రాణాలు అర్పించారు. మీరేం (బీజేపీ) చేశారు. దేశం కోసం కనీసం మీ కుక్కయినా చనిపోయిందా? లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
మంగళవారం సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘ప్రస్తుతం నడుస్తున్నది ఇటాలియన్ కాంగ్రెస్. ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే రబ్బర్స్టాంప్లాంటివాళ్లు. రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలకు ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అనంతరం రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్ గోయల్ కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని సూచించారు. దీంతో ఖర్గే స్పందిస్తూ ‘నేను ఆ వ్యాఖ్యలు చేసింది సభలో కాదు. రాజస్థాన్‌లో అన్నాను. సభలో మాట్లాడని వ్యాఖ్యలకు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అయి నా నా వ్యాఖ్యల్లో తప్పేముంది? దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం చేయలేదా? ఇది నిజం కాదా? చెప్పండి? మీ నాయకుల్లో ఎవరైనా దేశం కోసం ప్రాణాలర్పించారా? ఒకవేళ అర్పిస్తే పేర్లు చెప్పండి? అంతేగానీ నిజాన్ని దాచి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఇంకా ఎన్నిరోజులు పూట గడుపుతారు? నేను తప్పు చేయలేదు. ఉన్న విషయాన్నే చెప్పాను. అది కూడా సభ బయట చెప్పాను. కాబట్టి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’ అని గట్టిగా సమాధానమిచ్చారు.
ఎన్హెచ్ఆర్సీ దుర్వినియోగం
బీహార్ కల్తీ మద్యం కేసు విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ), ఎన్‌సీపీసీఆర్‌ను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నాదంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.