బెంగళూరు, మార్చి 12 : స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు కేసులో రాజకీయ నేతలెవ్వరికీ సంబంధాలు లేవంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసిన కొద్ది గంటలకే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి సీఎం సిద్ధరామయ్య దిగిన ఫొటో బయటపడింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను సామాజిక మాధ్యమంలో బుధవారం షేర్ చేశారు. ‘రన్యారావు స్మగ్లింగ్ కేసు ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య ముంగిటకు చేరింది. ఈ ఫొటోలో హోం మంత్రి జీ పరమేశ్వరను కూడా మనం చూడవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఆర్థిక నేరాలు విచారించే ప్రత్యేక కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసు తీవ్రత, రన్యారావుకు ఉన్న సంబంధం దృష్టిలో ఉంచుకుని ఆమెకు బెయిల్ మంజూరు చేయరాదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వాదించింది. సీనియర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను ఎయిర్‌పోర్టులో రన్యారావుకు రక్షణగా వెళ్లానంటూ అక్కడ ఆమెకు సహాయం చేసిన పోలీస్ అధికారి తమ విచారణలో వెల్లడించారన్నారు.