పొలానికి వెళ్తున్న రైతును దారిలోనే అడ్డుకున్నారు. భార్య కండ్లముందే కర్రలు, రాడ్లతో దాడిచేసి.. ఆయన కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. అక్కడితో ఆగకుండా జీపుతో తొక్కించి చంపేశారు. అడ్డుకున్న రైతు భార్యను, అక్కడికి చేరుకున్న కుమార్తెల బట్టలు చింపారు!.. అడిగిన ధరకు భూమిని అమ్మలేదన్న కోపంతో బీజేపీ నేత సాగించిన అమానుషమిది.బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో ‘లఖింపూర్’ అరాచకమిది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో 2021లో జరిగిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) పునరావృతమైంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు ఒకరు కారుతో తొక్కించి చంపివేయగా ఆదివారం బీజేపీ (BJP) పాలిత మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఓ 55 ఏండ్ల రైతును కాళ్లు, చేతులు విరగ్గొట్టిన స్థానిక బీజేపీ నాయకుడు, అతని అనుచరులు జీపుతో ఆ రైతును తొక్కించి చంపివేశారు. గణేశ్‌పురా గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకున్నది. రామ్ స్వరూప్ ధాకడ్ అనే రైతును థార్ జీపుతో తొక్కించి హతమార్చిన బీజేపీ నాయకుడు ఆ రైతు కుమార్తెలు, భార్యపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. ఆదివారం ఉదయం ధకడ్, ఆయన భార్య తమ పొలానికి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు ఫతేగఢ్ పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకుడు మహేంద్ర నాగర్, అతని కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, మరో 14 మందిని ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ధకడ్పై కర్రలు, రాడ్లతో దాడి చేసిన మహేంద్ర నగర్, అతని అనుచరులు అనంతరం జీపుతో అతడిని తొక్కించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కారు చౌక ధరలకు తమ భూములను అమ్మేయాలంటూ నగర్, అతని కుటుంబ సభ్యులు చిన్న రైతులను బెదిరిస్తున్నారని, ఇందుకు ధకడ్ నిరాకరించడంతో ఆయనపై దాడి చేసి చంపేశారని పోలీసులు తెలిపారు. తమ తల్లిదండ్రుల ఆర్తనాదాలు విని పరుగున అక్కడకు చేరుకున్న ధకడ్ కుమార్తెలను చితకబాదిన నిందితులు వారిపైన అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు చెప్పారు. మా నాన్నను కాపాడేందుకు వెళ్లిన నన్ను వాళ్లు కిందపడేసి నాపైన కూర్చున్నారు. నన్ను కొట్టడమేగాకుండా నా వస్ర్తాలు చింపేశారు. తుపాకీతో నాపైన కాల్పులు కూడా జరిపారు. పొలానికి వెళుతున్న నా తల్లిదండ్రులపై నిందితులు దాడి చేశారు.
మా అమ్మ అడ్డుపడేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా కొట్టి మా నాన్నను జీపుతో తొక్కించి చంపేశారు అని ధకడ్ కుమార్తెలలో ఒకరు విలేకరులకు తెలిపారు. ఈ హింసాకాండ దాదాపు గంటసేపు సాగిందని ధకడ్ సోదరుడు రామ్‌కుమార్ తెలిపారు. ఇద్దరు ఆడపిల్లల బట్టలు చింపేశారని, దాదాపు 20 మంది వ్యక్తులు గాల్లో కాల్పులు జరపగా తాము భయపడిపోయామని ఆయన చెప్పారు. దాదాపు గంటసేపు కర్రలు, రాడ్లతో దాడి చేసిన దుండగులు ఆ తర్వాత తన సోదరుడిని ట్రాక్టరుతో, తర్వాత కారుతో తొక్కించారని ఆయన ఆరోపించారు. ధకడ్ దేహాన్ని వెంటనే దవాఖానకు తరలించడానికి నిందితులు అనుమతించలేదని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన రైతును దవాఖానకు తరలించడానికి దాదాపు గంటపాటు నిందితులు అనుమతిచలేదని, తుపాకీ పట్టుకుని అక్కడే కూర్చున్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ధకడ్ని దవాఖానకు తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన చెప్పారు.
బీజేపీ పాలనపై విపక్షాల ధ్వజం
బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిషీ అగ్రవాల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో లూటీలు, రేప్‌లు పెరిగిపోయాయని, హోం మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ ఘోరాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి భయపడి పోలీసులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. గుణ జిల్లాలో జరిగిన ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరీ కేసును తలపిస్తున్నది. 2021 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకి చెందిన కాన్వాయ్ నిరసన తెలియచేస్తున్న రైతులపైకి దూసుకెళ్లడంతో రైతులు, జర్నలిస్టుతోసహా ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. అయితే, ఆ తర్వాత ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు ఓ డ్రైవర్ని, ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు.