Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు. కోల్కతాలోని ఆయన నివాసంలో శుక్రవారం న్యూ టౌన్లో జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో ఇద్దరూ వివాహం చేసుకోనుండగా.. దగ్గరి బంధువులు హాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సహా సీనియర్ బీజేపీ నాయకులు ఘోష్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దిలీప్ ఘోష్, కాబోయే భార్య ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు హాజరయ్యారని ఆ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. ఆ సమయంలోనూ ఇద్దరు నివాసం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అంతకు ముందు దిలీప్ ఘోష్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ ‘నేను పెళ్లి చేసుకోవాలని మా అమ్మ కోరుకుంది’ అని తెలిపారు. ఆమె కోరికను గౌరవిస్తూ తాను పెళ్లి చేసుకుంటున్నానని.. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. నా వ్యక్తిగత జీవితం రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. రింకు మజుందార్ విషయానికి వస్తే.. చాలాకాలంగా బీజేపీ మహిళా విభాగంలో పని చేస్తున్నది. ఓబీసీ మోర్చా, చేనేత విభాగంలో సేవలందించారు. రింకుకు ఇది రెండో వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నారు. దిలీప్ ఘోష్ చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్లో పని చేశారు. సీపీఐ(ఎం) స్థానంలో బీజేపీని పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టడంలో ఎంతో కృషి చేశారు. వాస్తవానికి గతంలో బీజేపీకి పెద్దగా ఆదరణ లేకపోయింది. ఖరగ్పూర్ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించబోతున్నారు.
ఈ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. హిందూ సమాజంలో తమ ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవాలని సూచించారు. వక్ఫ్ చట్టంపై ఇటీవల జరిగిన హింసాకాండలో హిందువుల ఇళ్లే లక్ష్యంగా దాడికి పాల్పడ్డనట్లుగా వార్తలు వచ్చాయి. ముస్లింలు ఎక్కువగా నివసించే ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా చెలరేగిన హింసలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉత్తర24 పరగణాలు జిల్లాలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ హిందువులు టెలివిజన్ సెట్లు, రిఫ్రిజిరేటర్లు, కొత్త ఫర్నీచర్ కొంటున్నారని.. వారి ఇండ్లల్లో ఒక్క ఆయుధం కూడా లేదని.. ఏదైనా జరిగితే పోలీసులకు ఫోన్ చేస్తుంటారని.. వారు రక్షించరని వ్యాఖ్యానించారు.