కోల్‌కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్నదని, అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని వ్యాఖ్యానించారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సంస్థాగత సమావేశంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి టీఎంసీ రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా హాజరుకావడం గమనార్హం. మమత, ఆమె మేనల్లుడు అభిషేక్‌తో పాటు ఇతర నేతలతో కలసి ఆయన వేదిక పంచుకున్నారు. టీఎంసీ నేతలతో ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్‌కు పొరపొచ్చాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.