(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడోదఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో గుజరాత్లో 64.51 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. ఈసారి 6 శాతం తగ్గింది. దీంతో 2014, 2019లో గుజరాత్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 1 నుంచి 5 సీట్లు తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూపాలా వ్యాఖ్యలతో..
గుజరాత్లో బీజేపీకి క్షత్రియులు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న రాజ్‌పుత్‌లతో పాటు క్షత్రియులుగా పిలిచే మరికొన్ని ఓబీసీ సామాజికవర్గాలు ఇందులో ఉన్నాయి. మార్చి 22న ఓ సమావేశంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా రాజ్‌పుత్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్లతో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి పెండ్లి చేశారని నోరు జారారు. దీనిపై రాజ్‌పుత్‌లు భగ్గుమన్నారు.
ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ నినదించారు. రాజ్‌పుత్ మహిళలు ఆత్మహత్య చేసుకొంటామని బీజేపీ కార్యాలయాల ముందు నిరసనలు చేశారు. 109 క్షత్రియ సంఘాలు ఒక్కటయ్యాయి. వ్యతిరేకతను గుర్తించిన రూపాలా సహా బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోదీనే స్వయంగా బుజ్జగింపులకు దిగారు. అయినా క్షత్రియుల అసంతృప్తి కొనసాగుతున్నది. ఇదే తాజా ఓటింగ్‌ను ప్రభావితం చేసి బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.