SorenKalpana Soren | బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య, అధికార జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ అని వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జరిగిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన పథకానికి వ్యతిరేకంగా బీజేపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రజలకు ఉపయోగ పడే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే బీజేపీ దానికి అడ్డు పడుతున్నదని ఆమె ఆరోపించారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రవేశ పెడుతున్న ప్రతి పథకానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ బీజేపీ.. ఒక ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’లా మారిందని కల్పనా సోరెన్ ఆరోపించారు. గిరిజనుల సంస్కృతిని గుర్తించే కోడ్ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెడితే బీజేపీ దాన్ని అంగీకరించడం లేదన్నారు. గిరిజనుల సంస్కృతిని కాపాడేందుకు ఇష్ట పడటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని గిరిజన జాతులను రాజ్యాంగంలోని ఎనిమిదో షేడ్యూల్ లో చేర్చాలని కేంద్రానికి జార్ఖండ్ ప్రభుత్వం లేఖ రాస్తే, కేంద్రం తిరస్కరించిందన్నారు. గిరిజనుల హక్కులను, గిరిజన సంస్కృతిని హేమంత్ సోరెన్ సర్కార్ మాత్రమే కాపాడుతుందన్నారు.