ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు
అధికార నివాసాన్నే వదిలా.. పోరాటాన్ని కాదు: సీఎం ఉద్ధవ్
జాతీయ పార్టీ మద్దతుపై షిండే యూటర్న్
ఏ పార్టీ కాంటాక్ట్‌లో లేదని మాటమార్పు
రెబల్ శిబిరంలో 50కి చేరిన ఎమ్మెల్యేలు
ఉద్ధవ్‌తో ఎన్సీపీ అధినేత పవార్ కీలక భేటీ
ముంబై, జూన్ 24: మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల చేరికలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునే క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. పార్టీలో సంక్షోభానికి బీజేపీనే కారణమని మండిపడ్డారు. కమలదళం తమను వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చేశారు. అంతర్గత కుమ్ములాటలను ప్రోత్సహించడమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక షిండే క్యాంప్ గురించి మాట్లాడుతూ.. శివసేన, ఠాక్రే పేర్లను వాడకుండా అసమ్మతి నేతలు ఎలా ముందుకు వెళ్లగలరో చూస్తానన్నారు. పార్టీని ముక్కలు చేసిన రెబల్స్ గురించి తాను బాధపడటంలేదని పేర్కొంటూ పార్టీని మోసం చేసిన ఎమ్మెల్యేలు రాలిపోయే ఆకులు, వ్యాధితో నేలరాలే పండ్లతో సమానమని తెలిపారు. తానెప్పుడూ ముఖ్యమంత్రి పీఠం కావాలనుకోలేదన్నారు. ‘శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు.
శివసేన, ఠాక్రే పేరు వాడకుండా వారు ఎంతదూరం వెళ్లగలరు? షిండే తన కుమారుడిని ఎంపీని చేశారు. అయితే, నా కొడుకు (ఆదిత్య ఠాక్రే) మాత్రం రాజకీయంగా ఎదుగవద్దని భావిస్తున్నారు’ అని ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన గురించి తాను ప్రస్తుతం ఆలోచించుకోవడంలేదని అన్నారు. ‘వర్ష (అధికారిక నివాసం) వదిలి వచ్చాను. అంటే పోరాటాన్ని వదిలినట్లు కాదు. పదవుల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని అసలే కాదు’ అని పేర్కొన్నారు. తాజా సంక్షోభ పరిస్థితిపై తన తల్లి ఎంతో బాధ పడుతున్నారని ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంత బాధగా ఉండేది కాదని మా అమ్మ వాపోయింది. మన వల్ల ఎదిగిన వాళ్లు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న ఆరోగ్యం అడ్డం పెట్టుకొని వాళ్లు లాభం పొందారు’ అంటూ అసమ్మతి నేతలపై ఆదిత్యఠాక్రే మండిపడ్డారు. సంక్షోభం నేపథ్యంలో మాతోశ్రీలో ఉన్న ఉద్ధవ్‌తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. మరోవైపు, ముంబైలోని షిండే పోస్టర్లపై శివసేన కార్యకర్తలు నల్లటి సిరా చల్లారు. గుడ్లను విసిరిగొట్టారు.
దూత కూడా క్యాంప్‌లోకి..
అస్సాంలోని గువాహటి హోటల్లో క్యాంప్ పెట్టిన షిండే క్రమంగా తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు (40 మంది శివసేన, పది మంది స్వతంత్రులు) ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా 400 మంది మాజీ కార్పొరేటర్లతో కూడా షిండే వర్గం భేటీ అయ్యింది. తాజాగా మరో శివసేన ఎమ్మెల్యే కూడా రెబల్ క్యాంప్‌లో చేరారు. మంగళవారం షిండేతో రాయబారం జరిపిన ఎమ్మెల్సీ రవీంద్ర పాఠక్ కూడా రెబల్స్ వర్గంలో చేరారు. ఓ జాతీయ పార్టీ తమకు ఎలాంటి సాయమైనా చేస్తామని హామీ ఇచ్చిందంటూ గురువారం వ్యాఖ్యానించిన షిండే.. ఒక్కరోజులోనే మాటమార్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరుపట్లేదని తెలిపారు. కాగా, శివసేనలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ పాత్ర లేదని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.
మా రాష్ర్టానికి పంపండి.. చూసుకుంటాం.
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగవిరుద్ధంగా బీజేపీ కూలదోస్తుండటంపై బెంగాల్ సీఎం మమత మండిపడ్డారు. వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాంలో రెబల్ ఎమ్మెల్యేలను ఎందుకు ఉంచారని, తమ రాష్ర్టానికి వాళ్లను పంపిస్తే మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుతామని అన్నారు. కాగా సంక్షోభంలో ఎంవీఏ ప్రభుత్వం కూరుకుపోవడంతో గడిచిన నాలుగు రోజుల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ అధీనంలో ఉన్న మంత్రిత్వ శాఖలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనుల జీవోలను జారీ చేశాయి. శివసేన శాసనసభ పక్ష నేతగా అజయ్ చౌధరీని నియమించిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను తొలగించాలని బీజేపీకి మద్దతు తెలుపుతున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.