బెంగళూరు, సెప్టెంబర్ 15: అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతుండగా, ఇటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. కర్ణాటకలో ఆర్టీసీ వ్యవస్థను ప్రైవేటుపరం చేస్తున్నారు. స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం డీజిల్ బస్సులను నిర్వహించాలంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.68.53 ఖర్చు అవుతున్నదని, ఆ ఖర్చును ప్రభుత్వం భరించలేక కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను ప్రైవేటుకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని, వాటిని నిర్వహణ సంస్థలే చూసుకొంటాయని వివరించారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కొనటం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, ఎన్ఈఆర్టీసీ, ఎన్డబ్ల్యూఆర్టీసీ పరిధిలో 35 వేల బస్సులు రవాణా కొనసాగిస్తున్నాయి.