న్యూఢిల్లీ, జూన్ 5: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటంలో మోదీ సర్కార్ వైఫల్యం మరోసారి బయటపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర నిరోధక కమిటీకి వైస్-చైర్‌గా పాక్ ఎంపికైంది. అలాగే తాలిబన్ ఆంక్షల కమిటీకి పాకిస్థాన్ సారథ్యం వహించనుంది. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాక్ ఐరాసకు చెందిన అత్యంత కీలకమైన రెండు కమిటీల్లో చోటు దక్కించుకోవటంపై భారత్‌లో విపక్షాలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పాక్‌ను ఎంపికచేయటం ఆమోదనీయం కాదని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. భారత్ సరైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘తాలిబన్లకు ఆశ్రయం కల్పించి, రక్షించిన పాక్ ఐరాస కమిటీకి నేతృత్వం వహిస్తుంది’ అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. భద్రతా మండలి ఓ జోక్‌గా మారిందని శివసేన (యుబీటీ) విమర్శించింది.