గాంధీనగర్: గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 22.68 లక్షల మంది కార్మికులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించింది. నకిలీ ఎంట్రీలు, తప్పుడు రిజిస్ట్రేషన్, వలసలు, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా వర్గీకరించటం.. తదితర కారణాలతో గుజరాత్ ప్రభుత్వం ఈ తొలగింపులు జరిపినట్టు కేంద్రం పేర్కొన్నది. కేంద్రం లోక్సభలో తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2019-20 నుంచి 2024-25 వరకు ఒక్క గుజరాత్లో 7.49 లక్షల జాబ్ కార్డుల్ని రద్దు చేశారు. దీని ద్వారా 22.68 లక్షల మంది కార్మికుల పేర్లు తొలగింపునకు గురయ్యాయి. గుజరాత్లో ఉపాధి హామీ చట్టం అమలు తీరు లోకసభలో మంగళవారం చర్చనీయాంశమైంది. పథకం అమలులో గుజరాత్ ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంపై విపక్ష సభ్యులు సందేహం వ్యక్తం చేశారు.