న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: గత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1,473 కోట్ల నిధులను పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర, రాష్ట్ర విభాగాల వ్యాప్తంగా పొందిన రూ.207 కోట్ల కన్నా ఏడు రెట్లకు పైగా అధికమని ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసిన వ్యయ నివేదికలు వెల్లడించాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ర్టాలకు సంబంధించిన సమగ్ర వ్యయ నివేదికను ఇదివరకే సమర్పించిన కాంగ్రెస్ పార్టీ మార్చి 15 నుంచి మే 6 వరకు సాగిన ఎన్నికల కాలంలో రూ. 207.17 కోట్ల నికర ఆదాయాన్ని, రూ.248.56 కోట్ల వ్యయాన్ని నమోదు చేసింది.
దీనికి భిన్నంగా ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన వ్యయ వివరాల ప్రకారం అదే కాలంలో బీజేపీకి కేవలం దాని కేంద్ర కార్యాలయంలోనే రూ.1,472.8 కోట్ల ఆదాయం సమకూరింది. కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యయ నివేదికలు ఇంకా బహిర్గతం కాలేదు. అంటే పార్టీ సమగ్ర ఆదాయం(స్వీకరించిన నిధులు) ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి బీజేపీ తన కేంద్ర కార్యాలయంలో ప్రారంభంలో ఉన్న దాని కంటే గణనీయంగా ఎక్కువ నిధులను కలిగి ఉంది.
మార్చి 15 నాటికి రూ.6,722.6 కోట్లుగా ఉన్న ఆ పార్టీ నిధుల నిల్వ మే 6 నాటికి రూ.7,627.2 కోట్లకు పెరిగింది. అంటే ఎన్నికల కాలంలో ఈ నిల్వ రూ.904.6 కోట్లు పెరిగింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ సుమారు రూ.1,597.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సుమారు రూ.130.4 కోట్లు పార్టీ సాధారణ ప్రచారం కోసం, మిగిలిన మొత్తం అభ్యర్థులు, సంబంధిత ఖర్చుల కోసం వినియోగించింది.