హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ నేతృత్వంలో ప్రారంభమైన పర్యావరణహిత సీడ్ గణేశ ఉద్యమానికి సినీ రంగం నుంచి విశేష మద్దతు లభిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంపత్ నంది జీఐసీ బృందం నుంచి సీడ్ గణేశ ప్రతిమను స్వీకరించి హర్షం వ్యక్తంచేశారు. అదేవిధంగా ముంబైలో ప్రముఖ సినీ నటి పూజాహెగ్డే సైతం సీడ్ గణేశుడిని అందుకొని ఈ వినూత్న పర్యావరణ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
సహజసిద్ధమైన మట్టి, కోకోపీట్, కొబ్బరి పొట్టుతో పాటు వేప, చింత వంటి స్థానిక వృక్ష జాతుల విత్తనాలతో ఈ విగ్రహాలను తయారు చేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వీటిని సహజ జలాశయాల్లో కాకుండా, ఇంట్లోనే కుండీలలో లేదా మట్టిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ విత్తనాలు మొలకెత్తి పచ్చని మొకలుగా ఎదుగుతాయి. తద్వారా నీటి వనరులను కలుషితం చేసే విషపూరిత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ), రసాయన రంగుల విగ్రహాల స్థానంలో ఒక కొత్త ప్రాణం చిగురించి భక్తితో పాటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సీడ్ గణేశ మహోద్యమంపై సంతోష్ కుమార్ స్పందించారు. భక్తులంతా తమ దైవభక్తిని ప్రకృతి పరిరక్షణతో ముడిపెట్టాలని, నీటి వనరులను దెబ్బతీసే విగ్రహాలను విడనాడాలని ఆయన కోరారు.
2018లో ‘మూడు మొకలు నాటండి, మూడేండ్లు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి‘ అనే స్ఫూర్తిదాయక నినాదంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా కోట్ల మొకలను నాటి పచ్చదనాన్ని విస్తరించింది. ఈ ఏడాది ప్రతి ఒకరూ సీడ్ గణేశుడిని ప్రతిష్ఠించి మొకగా మార్చాలని, మరో ముగ్గురిని ఈ మంచి పనికి నామినేట్ చేస్తూ సంప్రదాయాన్ని, పర్యావరణ హితాన్ని ఏకం చేయాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.