చెన్నై, అక్టోబర్ 4: కరూర్ తొక్కిసలాట తర్వాత చిక్కుల్లో పడిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ను మచ్చిక చేసుకుని వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా కరూర్ ఘటనపై డీఎంకే ప్రభుత్వం టీవీకేని ఇబ్బంది పెట్టాలని చూస్తే తాము అండగా ఉంటామని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు విజయ్‌కి కబురు పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరూర్ ఘటనలో డీఎంకేని కూడా బాధ్యురాలిని చేయాలని తాము భావిస్తున్నామని, విజయ్ సంయమనం పాటించాలని ఆ నాయకుడు సూచించినట్లు వారు చెప్పారు. తన భవిష్యత్తు రాజకీయ ర్యాలీలపై సందిగ్ధంలో పడిన విజయ్‌ని తమ దారిలోకి తెచ్చుకుని ప్రజలలో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ద్వారా ఎన్నికల లబ్ధి పొందాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.
పూర్తి నిజాలు బయటకు తెస్తాం: స్టాలిన్
కరూర్‌లో ఇటీవల జరిగిన ఘోర దుర్ఘటనపై శనివారం తీవ్ర విచారం వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనకు ఎవరు బాధ్యులో నిగ్గుతేల్చి, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను, చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఎక్స్ పోస్టులో స్టాలిన్ తెలిపారు.