Karnataka Elections | బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక బీజేపీలో కొత్త కలవరం మొదలైంది. ఇంతకాలంగా ఆ పార్టీకి అండగా ఉంటున్న లింగాయత్ సామాజకవర్గం ఈసారి తమకు దూరమవుతారేమో అని కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ‘లింగాయత్‌లను బీజేపీ అవమానిస్తున్నది’ అంటూ మొదలైన కొత్త చర్చ ఇప్పుడు బీజేపీ పెద్దలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నది. లింగాయత్ సామాజకవర్గానికి చెందిన జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవదికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో వారు బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ ఇద్దరు లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకులు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే. పైగా వివాదరహితుడు. అయినా కూడా కారణం చెప్పకుండా బీజేపీ టికెట్ నిరాకరించింది. లక్ష్మణ్ సవది కూడా బలమైన నేత. డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వీరిద్దరిని బీజేపీ పక్కనపెట్టడం వల్ల ఆ పార్టీ పట్ల లింగాయత్ ప్రజల్లో అసంతృప్తి మొదలైనట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ దీనిని తెలివిగా అందిపుచ్చుకున్నది. ‘లింగాయత్‌లకు బీజేపీ అవమానం’ అంటూ కొత్త ప్రచారాన్ని బలంగా మొదలుపెట్టింది.
ఉత్తర కర్ణాటకలో బీజేపీకి ఇబ్బందులే!
కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ప్రజలు 17 శాతం ఉన్నారు. ముఖ్యం గా ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కు వ. ఈ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప కీలక నేతగా ఎదిగారు. బీజేపీకి ఇంతకాలంగా లింగాయత్‌లు మద్దతు ఇవ్వడానికి ఆయనే ప్రధాన కారణం. అయితే, యెడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల కూడా లింగాయత్‌లలో అసంతృప్తి నెలకొన్నది. ప్రస్తుత సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే అయినా ఆ వర్గం ప్రజల్లో యడియూరప్పకు ఉన్నంత క్రేజ్ బొమ్మైకి లేదు. యెడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడంతో మొదలైన లింగాయత్‌ల అసంతృప్తి శెట్టర్, లక్ష్మణ్ వంటి కీలక నేతలకు టికెట్లు నిరాకరించడంతో మరింత ముదురుతున్నట్టు కనిపిస్తున్నది.
పదేండ్ల కిందటి సీన్ రిపీట్ ?
లింగాయత్‌లు దూరమైతే పార్టీ పరిస్థితి ఏంటనేది బీజేపీకి పదేండ్ల కిందనే అనుభవమైంది. 2013లో యెడియూరప్ప బీజేపీని వదిలి కర్ణాటక జనతా పక్ష పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు లింగాయత్‌లు బీజేపీకి దూరమై ఆయన వెంట నడిచారు. దీంతో ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీ కేవలం 40 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు కూడా లింగాయత్‌లు పార్టీకి దూరమైతే అలాంటి పరిస్థితులే వస్తాయేమో అనే ఆందోళన బీజేపీ నేతల్లో మొదలైంది. శెట్టర్, లక్ష్మణ్ సవది ఎన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ప్రభావం చూపగలరనేది పక్కనపెడితే.. లింగాయత్‌లను బీజేపీ అవమానిస్తున్నదనే ప్రచారం మాత్రం కచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.