UP Polls : యూపీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో అన్ని పార్టీలూ బిజీ బిజీ అయిపోయాయి. ఆయా సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిని అన్ని పార్టీలూ ప్రారంభించాయి. ఇందులో భాగంగా బీజేపీ జాట్లపై తన దృష్టిని కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల్లో కూడా జాట్ ఓట్లు గంపగుత్తగా తమకే పడే విధంగా వ్యూహ రచనను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా జాట్ల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు కేంద్రమంత్రులతో పాటు 250 మంది జాట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ బీజేపీకి మద్దతిస్తూనే వున్నారని, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకే మద్దతివ్వాలని అమిత్షా విజ్ఞప్తి చేశారు. అయితే జాట్ నేతలు మాత్రం తమ వైఖరిని ఇంకా ప్రకటించలేదు. బీజేపీపై జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్షా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా జాట్లకు, బీజేపీ మధ్య వున్న సంబంధాన్ని అమిత్షా వివరించినట్లు సమాచారం. 650 ఏళ్లుగా జాట్ వర్గం చేస్తోన్న పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొఘలాయిలకు వ్యతిరేకంగా పోరాడారని, రైతుల కోసం కూడా పోరాడిన చరిత్ర జాట్ వర్గానికి ఉందని అమిత్షా గుర్తు చేశారు. కేవలం వ్యక్తిగతం కోసమే కాకుండా దేశ భద్రత గురించి కూడా జాట్ వర్గం ఆలోచిస్తుందని, దేశ భద్రత విషయంలో బీజేపీ చాలా గట్టిగా వుందని అమిత్షా వారికి వివరించారు.
పశ్చిమ యూపీపై పట్టు సాధించాలని బీజేపీ బలంగా ప్రయత్నాలు ప్రారంభించింది. జాట్ వర్గంలో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వుందని, దానిని చల్లార్చడానికే అమిత్షా రంగంలోకి దిగారన్న ప్రచారమూ వుంది. పశ్చిమ యూపీలో రైతులు, జాట్లు, ముస్లింల ప్రాబల్యం విపరీతంగా వుంది. ఓట్లను పోలరైజ్ చేయడానికి కొన్ని కీలకమైన సమస్యలను లేవనెత్తడం ద్వారా తిరిగి వీరందరి ఓట్లను గంపగుత్తగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.