BJP | బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ నాయకుడ్ని బీజేపీ.. పార్టీ నుంచి బహిష్కరించింది. గత బుధవారం అవంతిబాయి లోధీ జయంతి సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశంలో బీజేపీ నేత ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు మతం పేరుతో ప్రజలను మోసగించి, వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ప్రీతం సింగ్ లోధీ.. గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన నేత.
ప్రీతం సింగ్ లోధీపై బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య శతృత్వం పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే ప్రీతం సింగ్ లోధీపై రెండు హత్య, నాలుగు హత్యాయత్నం కేసులు సహా 37 కేసులు ఉన్నాయి.
మాజీ సీఎం ఉమాభారతికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న ప్రీతం సింగ్ లోధీ, 2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో శివ్పూరి జిల్లా పిచ్చోర్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే కేపీ సింగ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. బుధవారం జరిగిన సమావేశంలో ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. ప్రజల డబ్బు, వనరులతో బ్రాహ్మణులు సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు.