BJP | న్యూఢిల్లీ : ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిన జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,358 విరాళాల ద్వారా బీజేపీ రూ.2,243 కోట్లను పొందింది. ఈ విషయాన్ని సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ సమాచారాన్ని సేకరించింది.
రూ.20వేలను మించి అందే రాజకీయ విరాళాల వివరాలను ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2023-24 సంవత్సరంలో అన్ని జాతీయ రాజకీయ పార్టీలు 12,547 విరాళాల ద్వారా రూ.2,544.28 కోట్లు అందుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 199 శాతం అధికం. ఈ మొత్తం విరాళాలలో బీజేపీ ఒక్కటే 88 శాతం అందుకోగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్కు 1,994 విరాళాల ద్వారా రూ.281.48 కోట్లు వచ్చాయి.