న్యూఢిల్లీ, జనవరి 6: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుకొన్నారు. బల్లలపైకి ఎక్కి మరీ తన్నుకొన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేయగా, ప్రధాని మోదీ డౌన్‌డౌన్ అంటూ ఆప్ సభ్యులు పెద్దపెట్టున నినదించారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సభ వాయిదా పడింది. డిసెంబర్లో నిర్వహించిన ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎంసీడీపై 15 ఏండ్లుగా కొనసాగుతున్న పట్టు పోవటంతో బీజేపీ రగిలిపోతున్నది. మేయర్ పీఠం దక్కించుకొనేందుకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలకు దిగుతున్నదని ఆప్ ఆరోపిస్తున్నది. ఎన్నికల్లో ఓడిపోయినా తమ పార్టీ అభ్యర్థే మేయర్ అవుతారని బీజేపీ నేతలు ప్రకటించటం గమనార్హం.
ఏం జరిగిందంటే
డిసెంబర్ 4న నిర్వహించిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించింది. మొత్తం 250 సీట్లుగల ఎంసీడీలో ఆప్ 134 సీట్లు గెలిచి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 104 సీట్లుతోనే సరిపెట్టుకొన్నది. ఎంసీడీ చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిర్వహించే మొదటి కౌన్సిల్ సమావేశంలో కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలి. ఈసారి సభ్యులంతా కొత్తవాళ్లు కావటంతో వారంతా ప్రమాణం చేయాల్సి ఉన్నది. నిబంధనల ప్రకారం సభ్యులందరితో ప్రమాణం చేయించేందుకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ అయిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించాలి. కానీ, ఈసారి ఆయన నియమాలకు విరుద్ధంగా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.
కొత్త సభ్యులతో ప్రమాణం చేయించేటప్పుడు ఎన్నికైన సభ్యులతో మొదలుపెట్టడం నియమం. కానీ, శుక్రవారం సభ సమావేశం కాగానే సత్యశర్మ.. నామినేటెడ్ సభ్యులతో ప్రమాణం చేయించటం మొదలుపెట్టారు. దీంతో ఆప్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. వీరికి పోటీగా బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లటంతో తోపులాట చోటుచేసుకొన్నది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకొన్నారు. దీంతో సభను సత్యశర్మ నిరవధికంగా వాయిదా వేశారు.
బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగడంతో రణరంగంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
మేయర్ పీఠం కోసం బీజేపీ కుతంత్రాలు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను 2012లో మూడు ముక్కలుగా విభజించి, తిరిగి ఏడాది క్రితమే ఒక్కటిగా చేశారు. ఒక్కటిగా కలిసిపోయిన తర్వాత నిర్వహించిన మొదటి ఎన్నికల్లోనే బీజేపీకి ఆప్ షాకిచ్చింది. అయితే, దేశంలోని అనేక రాష్ర్టాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసి అధికారంలోకి వచ్చినట్టుగానే ఎంసీడీలో కూడా మెజారిటీ లేకున్నా మేయర్ పీఠం దక్కించుకొనేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంసీడీలో సభ్యులకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. దీంతో ఆప్ సభ్యులను నయానో భయానో తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదనే విమర్శలున్నాయి. మరోవైపు సాంకేతికంగానూ పైచేయి సాధించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సభలో 250 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
చట్టప్రకారం మేయర్ ఎన్నికలో వీరితోపాటు ఢిల్లీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ 14 మంది ఆప్ ఎమ్మెల్యేలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులను నామినేట్ చేశారు. ఢిల్లీలో బీజేపీకి 9 మంది లోక్‌సభ సభ్యులున్నారు. వీరు కూడా మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. చట్టప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఎంసీడీకి పది మందిని నామినేట్ చేస్తారు. వీరిని ఓల్టర్మెన్ అంటారు. నామినేటెడ్ సభ్యుల ఎంపికలో ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ సలహా తీసుకోవాలి. కానీ, ఈసారి ఎల్జీ వీకే సక్సేనా ఆ నియమానికి నీళ్లొదిలి కేజ్రీవాల్ ప్రభుత్వానికి తెలియకుండానే పదిమందిని నామినేట్ చేశారు. వీరంతా బీజేపీ అనుకూలురనే విమర్శలున్నాయి. ఈ నియామకాలపై కేజ్రీవాల్ గురువారం తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
ఇక ప్రభుత్వం ఉన్నదెందుకు?
ఎల్జీ సక్సేనా రాజ్యాంగవిరుద్ధంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు లేని అధికారాలను కూడా ఎల్జీ ప్రయోగిస్తున్నారని, చీఫ్ సెక్రటరీకి నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు, ఉద్యోగులపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు పది మందిని ఎల్జీ నామినేట్ చేయడం సంప్రదాయవిరుద్ధమని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని అని పేర్కొన్నారు.
మెజారిటీ లేకపోయినా..
బీజేపీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఇప్పటికీ ఎంసీడీలో మెజారిటీ మార్కుకు దగ్గరగా రాలేదు. అయినా, మేయర్ పదవిని తామే దక్కించుకొంటామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఆప్‌కు ఎంసీడీలో ఓట్ల పరంగా 134 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 151 ఓట్ల మెజారిటీ ఉన్నది. మేయర్ ఎన్నికకు కావాల్సింది 126 ఓట్లు. అంటే ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్టే. ఇక బీజేపీకి 104 మంది కౌన్సిలర్లు, 9 మంది లోక్‌సభ సభ్యులు కలిపి మొత్తం 113 ఓట్లే ఉన్నాయి. అయినా, ఆ పార్టీ మేయర్ పదవి దక్కించుకొంటామని ప్రకటిస్తుండటం గమనార్హం. ఇక, 10 మంది నామినేటెడ్ పెద్దలకు 2015 వరకు ఎంసీడీలో ఎలాంటి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత ఓనిక్స్ మల్హోత్రా కోర్టుకు వెళ్లారు. దీంతో వార్డు కమిటీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్దలకు ఢిల్లీ హైకోర్టు అవకాశమిస్తూ 2015 ఏప్రిల్ 27న తీర్పు చెప్పింది. అయితే, వీరికి మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉన్నదా? లేదా? అన్నదానిపై తీర్పులో స్పష్టత లేదు.
వాళ్లకు ఓటు వేసే అవకాశం ఉండి, అందరూ బీజేపీ ఓటు వేసినా మేయర్ ఎన్నికకు అవసరమైన మెజారిటీ రాదు. అయినా, మేయర్ పదవి దక్కించుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. డబ్బులు వెదజల్లి తమ కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆప్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నది. ఒక్కొక్కరికి రూ.10 కోట్ల చొప్పున రూ.100 కోట్లు ఇస్తామని తమ కౌన్సిలర్లకు బీజేపీ ఆశ చూపిందని ఆప్ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు గుప్పించారు.