పాట్నా: బీజేపీ పాలిత బీహార్‌లో ఓ గ్రామంలోని రోడ్డు పక్కన కొందరు పిల్లలు శ్రద్ధగా పరీక్ష రాయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ‘సివాన్ జిల్లాలోని ఓ కోచింగ్ కేంద్రం విద్యార్థులు రోడ్డు పక్కన పరీక్ష రాస్తూ ఇలా కనిపించారు. ఇందుకే బీహార్ భారత్‌లోనే అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది’ అని ఎక్స్‌లో షేర్ చేసిన ఓ వీడియో కింద రాశారు.
ప్రజలు రోడ్లపై ప్రయాణిస్తుండగా కొందరు పిల్లలు నిలబడి, మరి కొందరు కూర్చొని పరీక్ష రాస్తున్న దృశ్యాన్ని చాలా మంది నెటిజన్లు జీర్ణించుకోలేకపోయారు. ‘ఎక్కడైతే ఆరు బయలే తరగతి గదిగా మారుతుందో’ అని ఒకరు దీనిపై వ్యాఖ్యానించగా ‘దీపం కింద చీకటి ఇంకా తొలగిపోలేదు’ అని మరొకరు కామెంట్ చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన లేకపోవడం వల్లే ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయని మరొకరు వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలోనే అసలు సమస్య ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్ మాత్రం శ్రద్ధగా పరీక్ష రాసిన పిల్లల స్ఫూర్తిని మెచ్చుకున్నారు.