(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీట్-యూజీలో అవకతవకలు జరుగడం 2024లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇక, 2021లో జేఈఈ మెయిన్ పేపర్ హ్యాకింగ్‌కు గురవ్వడం, అదే ఏడాది రాజస్థాన్‌లో నీట్ పేపర్ లీకవ్వడం కలకలం సృష్టించింది. ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 9 ఏండ్ల వ్యవధిలోనే 13 పరీక్ష పేపర్లు లీక్ అవ్వగా, హర్యానాలో బీజేపీ పాలనలో మొత్తం 28 పేపర్లు లీకయ్యాయి. యూపీలో మూడేండ్ల వ్యవధిలోనే ఆరు పేపర్లు లీకవ్వగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ పదుల సంఖ్యలో పేపర్ లీకేజీలు వెలుగుచూశాయి.