న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సుప్రీంకోర్టు పరిమితులను ప్రశ్నిస్తూ బీజేపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. మొన్న..ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖఢ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు సర్వోన్నత న్యాయస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యవహరిస్తూ పోతుంటే ఇక పార్లమెంట్‌ను మూసివేయడం మంచిదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే పార్లమెంట్‌ను మూసివేయాలి’ అని ఎక్స్ వేదికగా దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు.
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని దూబే ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. వక్ఫ్ చట్టంలోని అనేక అంశాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తదుపరి విచారణ వరకు చట్టంలోని వివాదాస్పద నిబంధనలను అమలు చేయకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.