BJP : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదేశాలు జారీ చేశారు.
నాలుగు రాష్ట్రాలకు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా కొత్త అధ్యక్షుల్ని నియమిస్తున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్‌ను, హరియానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్రాయ్ను నియమించారు. ఇంతకుముందు ఢిల్లీకి అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా, పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ ఝకార్, హరియాణా అధ్యక్షుడిగా మోహన్ లాల్ బదోలి, త్రిపుర అధ్యక్షుడిగా రజీబ్ భట్టాఛార్జీ ఉండేవారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేవల్ సింగ్ ధిల్లాన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
అలాగే, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన హర్ష్ మల్హోత్రా తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన పార్టీ కోసం చాలా శ్రమించారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. హరియాణా అధ్యక్షురాలిగా ఎన్నికైన అర్చనా గుప్తా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. ఆమెకు ఈసారి అధ్యక్షురాలిగా ప్రమోషన్ లభించింది. త్రిపురలో అత్యంత కీలక నియోజకవర్గమైన మతార్బారి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనకు తాజాగా అధ్యక్షుడిగా పదవి దక్కింది.