న్యూఢిల్లీ: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ(BJP ) పార్టీ ఇవాళ ఆ రాష్ట్రాలకు సీనియర్ నేతలను ఎలక్షన్ ఇంఛార్జీలుగా ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఇంఛార్జీగా వ్యవహరించనున్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా కో ఇంఛార్జీలుగా చేయనున్నారు.
పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను పశ్చిమ బెంగాల్‌కు ఇంఛార్జీ మంత్రిగా ప్రకటించారు. పార్టీ వ్యూహాలను ఆయన రచిస్తారు. ఆయనకు తోడుగా త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కో ఇంఛార్జీగా ఉంటారు. ఢిల్లీకి చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాకు తమిళనాడు బాధ్యతలను అప్పగించారు. సివిల్ ఏవియేషన్ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ కూడా ఆయనకు తోడుగా పనిచేస్తారు.
బీహార్‌లో ఎన్డీఏ కూటమి రూపంలో బీజేపీ పోరు సాగించనున్నది. జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నది.