Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది. రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అవి ఈ ఏడాదికి సంబంధించి జూన్ 18న జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఉన్నతస్థాయి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
ఈ సమావేశంలో చర్చించిన అనంతరం బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ జాబితాను విడుదల చేశారు. రాజస్థాన్ నుంచి సతీష్ పూనియా, అల్కా గుర్జార్, మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజ్నీష్ అగర్వాల్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయ్ తగాక్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేష్ భాయ్ రత్వా, మాన్సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్జిభాయ్ కంజారియా , మణిపూర్ నుంచి శార్దా దేవి, ఒడిశా నుంచి శ్రీ దేవాసిష్ సమంతరాయ్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఏపీతోపాటు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, మేఘాలయ, ఝార్ఖండ్, మిజోరం, కర్ణాటక కూడా ఉన్నాయి. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 సీట్లు టీడీపీకి, ఒక సీటు జనసేనకు దక్కాయి. తమిళనాడులోని ఒక స్థానాన్ని టీవీకే కూటమి.. కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది.