Rahul Gandhi | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో గందరగోళం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పరమశివుడి చిత్రపటాన్ని చూపిస్తూ.. ‘హిందువులు ఎప్పుడూ భయాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయరు. కానీ, హిందువులుగా చెప్పుకునే కొందరు మాత్రం కేవలం హింస, విద్వేషం, అసత్యమే మాట్లాడతారు. మీరు హిందువులే కాదు’ అంటూ బీజేపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో మతపరమైన చిత్రాలను చూపించవద్దంటూ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు.
ఇది చాలా తీవ్రమైన అంశం: నరేంద్ర మోదీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. యావత్ హిందూ సమాజాన్ని హింసాత్మకమైనదిగా పేర్కొనడం చాలా తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను బీజేపీ గురించి మాట్లాడుతున్నానని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ అంటే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. హిందువులుగా గుర్తింపు పొందేందుకు గర్వపడుతున్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ దేశమంతా భయోత్పాతాన్ని వ్యాప్తి చేసిందని, రాహుల్ గాంధీకి అసలు అహింసపై మాట్లాడే హక్కు లేదని అమిత్ షా పేర్కొన్నారు.
రాజ్యాంగంపై దాడి: రాహుల్ గాంధీ
భారత్ అనే భావన, రాజ్యాంగంపై పూర్తిస్థాయిలో, ప్రణాళికబద్ధంగా దాడి జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన ప్రతిపక్ష నేతలపైనా వ్యక్తిగత దాడి జరిగిందని, ఇప్పటికీ కొందరు జైలులో ఉన్నారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ ఆదేశాలతో నాపైనా దాడి జరిగింది. నా మీద 20కిపైగా కేసులు ఉన్నాయి. నా ఇల్లు తీసేసుకున్నారు. 55 గంటల పాటు నన్ను ఈడీ విచారించింది.’ అని రాహుల్ ఆరోపించారు. తన ప్రసంగంలో అయోధ్యలో బీజేపీ ఓటమిని రాహుల్ ప్రస్తావించారు. ‘వాళ్లు(బీజేపీ) భయాన్ని వ్యాప్తి చేసినంత వరకూ నేను అయోధ్య గురించి మాట్లాడతా. రామ జన్మభూమి మీకు(బీజేపీ) స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో తన పక్కనే కూర్చున్న అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో గెలుపొందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి ‘శభాష్’ అంటూ అభినందించారు. ప్రభుత్వం నీట్‌ను వాణిజ్య పరీక్షగా మార్చేసిందని, ఇది కేవలం ధనికుల కోసం రూపొందించిందని, ప్రతిభావంతులైన వారి కోసం కాదని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ గాంధీపై చర్యలు ?
లోక్‌సభలో బీజేపీని విమర్శిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తున్నది. తాను కేవలం బీజేపీని మాత్రమే అన్నానని రాహుల్ స్పష్టత ఇచ్చినప్పటికీ వివాదం సమసిపోలేదు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ను బీజేపీ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.