పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తన మార్క్ రాజకీయాలకు తెరలేపిందా? తమకు కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని గద్దె దించేందుకు కమలం పార్టీ భారీ కుట్రకు పథక రచన చేసిందా? టీఎంసీని ఓడించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంవో) స్వయంగా రంగంలోకి దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. మమత పార్టీ ఓటమి కోసం ఏకంగా రూ.1000 కోట్లను ఖర్చు చేయడానికి కూడా బీజేపీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. టీఎంసీ తాజాగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ విషయాలు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కోల్కతా, ఏప్రిల్ 10/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలి. దీని కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే, ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంవో) స్వయంగా రంగంలోకి దిగుతుంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బెంగాల్లో కాషాయ జెండాను ఎగురవేయడానికి బీజేపీ పెను కుట్రకు పథక రచన చేసిందా? తాజాగా బయటపడిన ఓ వీడియో ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.బెంగాల్లో మమత హవాకు అడ్డుకట్ట వేసి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ సహా అగ్రనాయకత్వం అంతా బెంగాల్లోనే ఉండి మరీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో టీఎంసీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి రూ.1000 కోట్ల భారీ డీల్ కుదిరినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. దీన్ని ధ్రువపర్చేలా ఉన్న ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను టీఎంసీ నేతలు గురువారం బయటపెట్టారు. టీఎంసీని ఓడించడానికి ఆ పార్టీ బహిష్కృత నేత, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధ్యక్షుడు హుమాయున్ కబీర్తో బీజేపీ.. రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకొన్నట్టు టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీఎంసీ విడుదల చేసిన వీడియో ప్రకారం.. బెంగాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించడానికి బీజేపీ పథక రచన చేసినట్టు హుమాయున్ కబీర్ వీడియోలోని మరో వ్యక్తితో అన్నారు. టీఎంసీ నుంచి ముస్లిం ఓట్లను మళ్లిస్తే అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని, దీని కోసం ఓ వ్యూహం కూడా రెడీగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి రూ.1,000 కోట్లు పక్కనబెట్టారని, ఇందులో అడ్వాన్సుగా ఇప్పటికే రూ.200 కోట్లు తనకు ముట్టినట్టు కబీర్ చెప్తున్నట్టు వీడియోలో ఉన్నది. ఈ వ్యూహానికి సంబంధించి ఇప్పటికే తాను పీఎంవోతో సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు. బీజేపీ నాయకులు సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో తనకు సూచించిందని కబీర్ చెప్పినట్లు వీడియోలో ఉన్నది. ముస్లింలను వెర్రివాళ్లను చేయడం చాలా సులభమన్న కబీర్ ఇదే సమయంలో బాబ్రీ మసీదు గురించి ప్రస్తావించినట్టు వీడియోను బట్టి అర్థమవుతున్నది. బీజేపీ నాయకుల నుంచి ఇప్పటికే తనకు అడ్వాన్సుగా రూ. 200 కోట్లు ముట్టినట్లు కూడా ఆయన పేర్కొన్నట్టు వీడియో ద్వారా స్పష్టమవుతున్నది.
ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించడమే లక్ష్యంగా రూ. 1,000 కోట్లతో బీజేపీ కుట్రకు తెరలేపిందని టీఎంసీ ఆరోపించింది. ఈ కుట్రలో పీఎంవో కూడా భాగమయ్యిందని మండిపడింది. కబీర్ వ్యాఖ్యలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో దర్యాప్తు చేయించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. కాగా, టీఎంసీ ఆరోపణలను కబీర్ ఖండించారు. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ అన్నారు. తనను ఎన్నికల్లో దెబ్బతీసేందుకే టీఎంసీ నాయకత్వం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నదని మండిపడ్డారు. టీఎంసీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. బీజేపీ నాయకులెవరినీ తాను కలువలేదని తెలిపారు. ఈ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఇలాంటి 2,000 వీడియోలను కూడా మమత సులభంగా రూపొందించగలరని ఎదురుదాడికి దిగారు. బెంగాల్లో బాబ్రీ మసీదు ఏర్పాటు చేస్తామన్న వారితో (కబీర్తో) కలిసి కూర్చోవడం కంటే, మరో 20 ఏండ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోవడమే బీజేపీకి ఇష్టమన్నారు. కబీర్ పార్టీ, బీజేపీవి భిన్న ధ్రువాలని తెలిపారు.
వీడియోపై ఏఐఎంఐఎం పార్టీ స్పందించింది. ఎన్నికల సందర్భంగా కబీర్ పార్టీతో పెట్టుకొన్న పొత్తును వెంటనే రద్దు చేసినట్టు ప్రకటించింది. ముస్లింల సమగ్రతను దెబ్బతీసే ఎవరితోనూ తాము సంబంధం పెట్టుకోబోమని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.