బెంగళూరు: ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. తాజాగా జనన, మరణ ధృవీకరణ పత్రాల రుసుములను పది రెట్లు చేసింది. ఇప్పటి వరకు రూ.5గా ఉన్న జనన ధృవీకరణ పత్రం రుసుం ప్రస్తుతం రూ.50కు, రూ.2గా ఉన్న మరణ ధృవీకరణ పత్రం రుసుం రూ.20కు పెరిగింది.
కాగా, రూల్ ప్రకారం జనన, మరణ ధృవీకరణ పత్రాలు మొదటి 21 రోజులు ఉచితం. అయితే 21 నుంచి 30 రోజుల మధ్య రూ.5గా ఉన్న ఈ సర్టిఫికెట్ల రుసుం ప్రస్తుతం రూ.20గా నిర్ణయించారు. అలాగే 30 రోజుల తర్వాత ఐదు జనన ధృవీకరణ పత్రాల కాపీలను జారీ చేయడానికి గతంలో రూ.25 ఉండగా ప్రస్తుతం రూ.250కు పెరిగింది. పది రెట్లు మేర పెంచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమలులోకి వచ్చాయి.
మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రేట్ల భారాన్ని మోపడంపై ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మండిపడింది. ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నదని బీజేపీ సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. ఈసారి ఓటు వేసేటప్పుడు పౌరులు దీనిని గుర్తుంచుకోవాలని కోరారు.