హైదరాబాద్ : ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో చివరి వరకు మృత్యువుతో పోరాడి ఓడిన ఆయనకు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. తాను ఎక్కడైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడో అదే కాలేజీలో ప్రసంగం చేసేందుకు వెళ్లిన రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఈ మాతృభూమి ఒక రత్నాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిపిన్ రావత్ వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాన్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫీల్ డిగ్రీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లోమా చేశారు. 2011లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.