(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : 2012లో ప్రపంచం అంతమైపోతుందన్నారు. దీనిపై ఏకంగా ఓ సినిమానే వచ్చింది. అయితే, అలా ఏమీ జరుగలేదు. అయినప్పటికీ, యుగాంతం మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా విపత్తులు వచ్చినా.. సాంకేతికత హద్దులు దాటి మానవాళికి ముప్పు పొంచి ఉన్నా.. తాను, తన కుటుంబ సభ్యుల ప్రాణాలను భద్రంగా కాపాడుకోవాలన్న ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటివారి కోసమే ‘డూమ్స్ డే ఇండ్లు’ లేదా ‘డూమ్స్ డే బంకర్లు’ (Doomsday Bunkers) త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వంటి బిలియనీర్లు ఇప్పటికే ఇలాంటి బంకర్లను ఏర్పాటు చేసుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
భూకంపాలు, ప్రచండ గాలులు, సునామీలు, యుద్ధాలను తట్టుకొనే విధంగా ప్రత్యేకమైన కాంక్రీటు, ఇనుము, స్టీల్‌తో పది అడుగుల వెడల్పాటి గోడలతో నిర్మించే బంకర్లు లేదా ఇండ్లను ‘డూమ్స్ డే ఇండ్లు’గా పిలుస్తారు. భూమి లోపల వీటి నిర్మాణాన్ని చేపడుతారు. కొన్నిరోజులపాటు సరిపడా ఆహారం, నీళ్లు, విద్యుత్తు తదితర సదుపాయాలు ఈ ఇండ్లలో ఉంటాయి.
అమెరికాకు చెందిన వివోస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అత్యంత శక్తిమంతమైన డూమ్స్ డే ఇండ్ల నిర్మాణాన్ని ఇప్పటికే మొదలు పెట్టింది. ప్రాథమికంగా 575 ఇండ్లను నిర్మించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో 10 వేల మంది ఏడాదిపాటు నివాసం ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అద్దె రూ. 46 లక్షలుగా ఖరారు చేసినట్టు వివరించారు. ఇప్పటికే పలువురు మిలియనీర్లు ఇండ్లను బుకింగ్ చేసుకొన్నట్టు చెప్పారు. ఇక, రూ. 172 కోట్లు చెల్లించి తమ బంకర్లలో శాశ్వతంగా ఉండొచ్చని అమెరికాకు చెందిన స్ట్రాటజికల్లీ ఆర్మడ్ అండ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్స్ (సేఫ్) సంస్థ పేర్కొంది.
భూగోళంపై మానవాళి అంతం లేదా ప్రళయాన్ని సూచించే ‘డూమ్స్ డే క్లాక్’లో సమయాన్ని మిడ్‌నైట్‌కు కేవలం 90 సెకండ్ల ముందుకు ఇటీవల సెట్ చేశారు. 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత 17 నిమిషాలుగా ఉన్న క్లాక్ టైమింగ్, 90 సెకండ్లకు తగ్గించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. కరోనా వంటి వైరస్ ఎటాక్, వాతావరణంలో మార్పులు, కొత్త వ్యాధులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-గాజా ఉదంతం, అణ్వాయుధాల బెదిరింపులు వెరసి ఈ సంక్షోభాలు ఇలాగే కొనసాగితే.. ప్రపంచం అంతమవడానికి ఎంతో కాలంపట్టదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇక, మనిషిలా ఆలోచిస్తూ.. మనిషి మేధస్సునే అధిగమించే శక్తి గల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) ఆవిష్కరణలు ఊపందుకోవడం కూడా డూమ్స్ డే ఇండ్ల గిరాకీ పెరుగడానికి మరో కారణమని నిపుణులు చెప్తున్నారు.
హవాయి దీవుల్లోని 1,400 ఎకరాల్లో జుకర్‌బర్గ్ డూమ్స్ డే బంకర్ల నిర్మాణాన్ని 2014లోనే మొదలు పెట్టినట్టు వైర్డ్ మ్యాగజీన్ ఒక కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించకుండా బంకర్లను నిర్మిస్తున్న ఇంజినీర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లతో ఆయన రహస్య ఒప్పందం కూడా చేసుకొన్నట్టు తెలిపింది. కాలిఫోర్నియాలోనూ ఇలాంటి నిర్మాణాలనే జుకర్‌బర్గ్ చేపట్టినట్టు సమాచారం. ఇక, విపత్తులు సంభవిస్తే తాను న్యూజిలాండ్‌లోని బంకర్లోకి వెళ్తానని ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. ఏజీఐ అందుబాటులోకి వచ్చేకంటే ముందే తమ కంపెనీలోని టాప్ శాస్త్రవేత్తలను బంకర్లలోకి తీసుకెళ్తామని ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు కరెన్ హవో తెలిపారు.