DELHI| న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఆప్ లేఖ రాసింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, తద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
ఢిల్లీలో పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ మినహా ఇతర పాలనాధికారాలను ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మోదీ సర్కారు మే 9న ఆర్డినెన్స్‌ను జారీచేసింది. గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి ఓ అథారిటీని ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. ఈ అథారిటీలో సీఎం, మరో ఇద్దరు బ్యూరోక్రాట్లు సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇది ఎన్నికైన ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నదని కేజ్రీవాల్ సర్కారు ఆరోపిస్తున్నది. కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.