న్యూఢిల్లీ : బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను గంపగుత్తగా రద్దు చేసేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న పద్ధతిలో ఏదైనా చట్ట విరుద్ధత కనిపిస్తే ఈ చర్య తప్పదని తెలిపింది. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఈసీ ఎస్ఐఆర్ కోసం చట్టాన్ని, నిర్దేశిత నిబంధనలను పాటించినట్లు భావిస్తున్నామని పేర్కొంది.
ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది. తాము ఇచ్చే తుది తీర్పు యావత్తు దేశంలో నిర్వహించే ఎస్ఐఆర్పై ప్రభావం చూపేలా ఉంటుందని పేర్కొంది. బీహార్లో ఎస్ఐఆర్ చెల్లుబాటుపై తుది వాదనలను వచ్చే నెల 7న వినిపించాలని తెలిపింది.