పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార ఎన్డీఏలో ముసలం ఏర్పడింది. సీట్ల సర్దుబాటు వ్యవహారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనపడడం లేదు. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా ఎన్డీఏలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 103 స్థానాలు పంచుకుని ఇతర చిన్న పార్టీలకు మిగిలిన సీట్లను వదిలేయాలని భావిస్తున్నాయి. అయితే కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ), మాజీ సీఎం మాంఝి సారథ్యంలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా(హమ్) మాత్రం తమను అవమానిస్తే సహించేది లేదంటూ బీజేపీని హెచ్చరించడం విశేషం. ఎల్జేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఐదు స్థానాలకు పోటీ చేసి మొత్తం ఐదు స్థానాలనూ గెలుచుకుంది. ఈ విజయాన్నే బీహార్లో తన పార్టీ బలంగా చూపుతున్న చిరాగ్ పాశ్వాన్ తన పార్టీకి 40-50 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందేనని పట్టుపడుతున్నారు. బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఎల్జేపీకి 25 సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు చేసిన ప్రతిపాదనపై మండిపడిన చిరాగ్ తనకు 40 సీట్లు కావలసిందేనని పట్టుపట్టినట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 137 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జేపీ 136 స్థానాలలో పరాజయం చెందినప్పటికీ జేడీయూని మాత్రం 43 సీట్లకు కట్టడి చేయగలిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కారాదని ఎన్డీఏ ఆందోళన చెందుతోంది. సీట్ల కారణంగా మిత్రపక్షాలు దూరమైతే అది కూటమి విజయావకాశాలను దెబ్బతీయగలదని బీజేపీ భయపడుతోంది. కాగా, ఎల్జేపీ వ్యవస్థాపకుడు, తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ వర్ధంతిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో తన తండ్రిని స్మరించుకున్న చిరాగ్ పాశ్వాన్ ఇలా రాసుకొచ్చారు. నా తండ్రి ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు. నేరం చేయకు. నేరాన్ని సహించకు. బతకాలంటే చావడం నేర్చుకో. ప్రతి అడుగులో పోరాటం నేర్చుకో. ఈ వ్యాఖ్యలను బట్టి చిరాగ్ పాశ్వాన్ సీట్ల విషయంలో తగ్గే అవకాశం ఉన్నట్లు కనపడడం లేదు.
ఇక ఎన్డీఏలో మరో భాగస్వామ్య పక్షమైన హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా సీట్ల కేటాయింపుకు సంబంధించి బీజేపీ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన పార్టీకి కనీసం 15 సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము ఎన్నికల్లో పోటీచేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ శిబిరంలో ఉంటామే తప్ప పోటీ మాత్రం చేసే ప్రసక్తి లేదని ఆయన బీజేపీ అగ్ర నాయకత్వానికి తెగేసి చెప్పినట్లు సమాచారం. మాంఝీని బుజ్జగించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మమల్ని అవమానించవద్దని బీజేపీ నాయకులను వేడుకుంటున్నాము. మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే ఓ పార్టీగా మాకూ ఓ గుర్తింపు ఉంటుంది. నాకు సీఎం పదవిపై ఆశ లేదు. మా పార్టీని గుర్తించమని మాత్రమే కోరుతున్నాను అని ఆయన నడ్డా వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. మాంఝీ కూడా సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాట బయటకు చెప్పేశారు. కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు వారితో అన్న మాటలను మాంఝీ ఉటంకిస్తూ మాకు 15 గ్రామాలు(నియోజకవర్గాలు) ఇచ్చి మిగిలినవన్నీ మీ వద్దే ఉంచుకోండి. హమ్ (మా పార్టీ లేదా మేము) సంతోషంగా ఉంటాము. మీపైన ఎటువంటి ఆయుధాలు గురిపెట్టము అని రాసుకొచ్చారు.