శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 07:08:14

బీహార్‌ ఎన్నికలు : ప్రారంభమైన తొలి విడుత పోలింగ్‌

బీహార్‌ ఎన్నికలు : ప్రారంభమైన తొలి విడుత పోలింగ్‌

పాట్నా : బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత ఎన్నికల బరిలో 1066 మంది అభ్యర్థులు నిలిచారు. ఆర్జేడీ 42, జేడీయూ 42, ఎల్జేపీ 41, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు  కూటమిగా పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ యునైటెడ్ మరో కూటమిగా పోటీకి దిగాయి. ఇతర చిన్న పార్టీలు సైతం బరిలో నిలిచాయి.

కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా 10,868 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1600 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్యను 1000 మందికి పరిమితం చేసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, హ్యాండు శానిటైజర్లు, సబ్బు నీళ్లను అందుబాటులో ఉంచారు. 80 ఏండ్లు పైబడిన వారికి, దుర్భల పరిస్థితుల్లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఎయిర్‌ సర్వేలైన్లు, నదీపరివాహక ప్రాంతాల్లో మోటారు బోట్ల సాయంతో పెట్రోలింగ్‌ సహా దాదాపు 400 కంపెనీల పారామిలిటరీ దళాలను రంగంలోకి దింపారు.

ఎన్నికలు నిర్వహించే అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కమాండోలు, రాష్ట్ర పోలీసుకు బలగాలు గస్తీ కాస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు పహారా కాస్తున్నాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ సమయాన్ని కుదించారు. భక్తియార్‌ పూర్‌ మినహా మిగిలిన 46 నియోజకవర్గాల్లోనూ ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పొలింగ్‌ కొనసాగుతుందని ఎన్నికల అధికారి కుమార్‌ అన్షుమ్లీ తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా భక్తియార్‌ఫూర్‌లో పోలింగ్‌ను మూడుగంటలకే ముగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలిదశ అక్టోబర్‌ 28న, రెండోదశ నవంబరు 3న, తుది విడుత నవంబర్‌ 7న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.