పట్నా : కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో అన్ని స్కూళ్లలో ఒకే రకమైన దుస్తులను విద్యార్ధులు ధరిస్తారని..కొందరు తమ తలపై ఏదో ఒకటి (హిజాబ్ లేదా చందనం) ధరిస్తే దానిపై మనం ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజలందిరికీ వారిదైన జీవన విధానం ఉంటుందని..అందులో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని అన్నారు.
అసలు ఇలాంటి విషయాలపై చర్చ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఉడిపి మహిళా ప్రీ యూనివర్సిటీ కాలేజీలోకి హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అనుమతించకపోవడంతో ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం మొదలైంది. ఆపై ముస్లిం యువతులు తరగతి గదులకు హిజాబ్‌తో రావడం, అందుకు ప్రతిగా హిందూ విద్యార్ధులు కాషాయ శాలువాలు కప్పుకుని వచ్చిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.
కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీయడంతో మూడు రోజుల పాటు విద్యాసంస్ధల మూసివేతకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ముస్లిం బాలికలు కొందరు కర్నాటక హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.