పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసానుంది. భద్రతా కారణాలతో నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాల్లో తొలివిడతలో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. 1314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరికోసం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలివిడతలో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో బరిలో ఉన్నది. ఇక మహాగఠ్ బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ 73 చోట్ల, కాంగ్రెస్ నుంచి 24 మంది, సీపీఐ-ఎంఎల్ తరపున 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 119 మంది పోటీలో ఉన్నారు.
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘోపూర్), లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (మహువా), ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (తారాపూర్) ఉన్నారు.