కోల్‌కతా, జూన్ 3: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె పార్టీ రెండుగా చీలిపోయింది. 58 మంది రెబల్ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇటీవల మమత పార్టీ నుంచి బహిష్కరించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నేతగా రితబ్రత నియమితులయ్యారు. తిరుగుబాటు వర్గాన్ని పార్టీ శానససభా పక్షంగా గుర్తించాలని తాము చేసిన విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారని రితబ్రత మీడియాకు వెల్లడించారు. టీఎంసీకి చెందిన 58 మందితో పాటు మరో ఇద్దరు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. ఆయనకు అధికారులు ప్రతిపక్ష నేత చాంబర్ తాళాలను అప్పగించారు. ‘మేమే ప్రధాన ప్రతిపక్షం.. మేం ఒక జట్టుగా పోరాడుతాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఆయన విమర్శలు చేశారు. ఈ రెబల్ వర్గం జావెద్ ఖాన్, సందీపన్ సాహా, సియులి సాహాలను తప ఉప నేతలుగా ఎన్నుకుంది. అలాగే అఖ్రుజ్రచన్ను చీఫ్ విప్‌గా నియమించారు.
బుధవారం బెంగాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న క్రమంలో తమ పార్టీ నేత మమతా బెనర్జీయేనని, అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నట్టు రెబల్ వర్గ నేత రితబ్రత బెనర్జీ ప్రకటించారు. పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ తీసుకునే నిర్ణయంతో తమ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధం లేదని రెబల్ వర్గం స్పష్టం చేసింది. అసెంబ్లీలో విపక్ష నేతగా షోవన్దే చటోపాధ్యాయను నియమిస్తున్నట్టు స్పీకర్‌కు అభిషేక్ బెనర్జీ లేఖ రాసిన క్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. కాగా, ఆ లేఖపై తాము సంతకం చేయలేదని, అవి ఫోర్జరీవని ఎమ్మెల్యేలు సందీపన్ సాహా, రితబ్రత బెనర్జీలు అంతకుముందు ప్రకటించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై సందీపన్ సాహా, రితబ్రత బెనర్జీలను మమతా బెనర్జీ పార్టీ నుంచి బహిష్కరించారు.
పార్టీ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ టీఎంసీలో మరో విపత్కర పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కొందరు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్నది. పలువురు టీఎంసీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే దివ్యేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో 10 నుంచి 15 మంది టీఎంసీ ఎంపీలు తనను ఫోన్లో సంప్రదించారని తెలిపారు. త్వరలోనే టీఎంసీ పార్టీ కుప్పకూలనుందని జోస్యం చెప్పారు.
పార్టీలో తిరుగుబాటు సంభవించి రెండుగా చీలిపోయిన క్రమంలో రాష్ట్ర స్థాయి కమిటీలు, సంస్థాగత విభాగ కమిటీలను తక్షణం రద్దు చేస్తున్నట్టు మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా త్వరలోనే వీటిని పూర్తిగా పునర్నిర్మాణం చేయనున్నట్టు ఆమె తెలిపారు. దీంతో పార్టీ సంస్థాగత విభాగాలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ), తృణమూల్ మహిళా కాంగ్రెస్, తృణమూల్ యూత్ కాంగ్రెస్, ఐఎన్టీటీయూసీ, మైనారిటీ సెల్ విభాగాల కార్యవర్గాలన్నీ రద్దయినట్టు ఆమె వెల్లడించారు.
టీఎంసీ నేత, మమతకు అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో ఏర్పడిన సంక్షోభం తర్వాత కూడా ఆయన మమతకు మద్దతుగా నిలిచారు. మంగళవారం కోల్‌కతాలో జరిపిన నిరసనలో కూడా ఆయన మమతతో ఉన్నారు. అయితే పార్లమెంటరీ పార్టీ తప్ప పార్టీకి చెందిన అన్ని కమిటీలను మమత రద్దు చేయడంతో ఆయన మేయర్ పదవికి రాజీనామా చేశారు. హకీమ్ రాజీనామాను మమత ఆమోదించినట్టు సమాచారం.