శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 01:04:50

దేశద్రోహం కేసులో అరెస్టయిన టీచర్‌కు, తల్లికి బెయిల్‌

దేశద్రోహం కేసులో అరెస్టయిన  టీచర్‌కు, తల్లికి బెయిల్‌
  • పాఠశాలలో ప్రదర్శించిన నాటకంలో
  • మోదీని దూషించారని ఆరోపణలు

బెంగళూరు, ఫిబ్రవరి 15: సీఏఏ, ఎన్నార్సీపై పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ప్రధాని మోదీని దూషించారన్న ఆరోపణలపై దేశ ద్రోహం కేసు కింద అరెస్టయిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి, ఓ విద్యార్థిని తల్లికి శుక్రవారం బెయిల్‌ మంజూరైంది. ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేశారు. రూ.లక్ష చొప్పున వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు. విచారణకు సహకరించాలని, అధికారులు ఆదేశించినప్పుడల్లా విచారణకు హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించకూడదని స్పష్టంచేశారు. గత నెల 21న నాలుగు, ఐదు, ఆరో తరగతుల విద్యార్థులు ఆ పాఠశాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఆవీడియో సామాజిక మాధ్యమాల్లో  కనిపించింది. తొలుత మోదీకి సంబంధించిన వ్యాఖ్యలు లేవని, ఒక విద్యార్థిని తల్లి వాటిని నాటకంలో జోడించగా, టీచర్‌ దాన్ని అనుమతించారని అధికారులు తెలిపారు. నీలేశ్‌ రక్ష్యాల్‌ అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో జనవరి 31న వారిద్దరినీ దేశద్రోహం కేసు కింద పోలీసులు అరెస్ట్‌చేశారు. logo