న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న అమర్త్యసేన్ క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. అమర్త్యసేన్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుమార్తె నందనా సేన్ ఖండించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ట్విటర్ (X) లో ఒక పోస్టు చేశారు.
తన తండ్రి మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నందన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని, తామంతా కేంబ్రిడ్జిలో గత రాత్రి ఆనందంగా గడిపామని వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో తన తండ్రి రెండు కోర్సులు బోధిస్తున్నారని, అలాగే ఓ పుస్తకం రాసే పనిలో ఆమె నిమగ్నమై ఉన్నారని ఆమె తెలిపారు. తన తండ్రి బీజీగా ఉన్నట్లు తెలుపుతూ ఒక ఫొటోను కూడా షేర్ చేశారు.