చండీఘఢ్ : పంజాబ్ ప్రజలు గత నాలుగున్నర దశాబ్ధాలుగా కాంగ్రెస్, అకాలీదళ్‌లకు అవకాశం ఇచ్చి విసిగిపోయారని ఈసారి ఆప్‌నకు పాలనా పగ్గాలు అప్పగించాలని వారు కోరుకుంటున్నారని ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్‌ను డ్రగ్స్, మాఫియా రాజ్, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు కుంగదీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆప్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు.
ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించిన అనంతరం మాన్‌ను సీఎం అభ్యర్ధిగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రజల ముందుంచిన మొబైల్ నెంబర్‌కు పంపిన మెసేజ్‌లు, కాల్స్ ద్వారా 93 శాతం మంది మాన్ సీఎం అభ్యర్ధిత్వం వైపు మొగ్గుచూపారు. పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు ఆప్ అద్దంపడుతుందని మాన్ చెప్పుకొచ్చారు.
ఇక పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, పంజాబీలను ఆకట్టుకుని పాగా వేయాలని తమదైన వ్యూహాలకు ఆప్ నేతలు పదునుపెడుతున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం సహా పలు ఆకట్టుకునే పధకాలను ప్రకటించిన కేజ్రీవాల్ పంజాబీలను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేపట్టారు. ఇక మాజీ సీఎం కెప్టెన్ సింగ్ పార్టీతో చేతులు కలిపిన కాషాయ పార్టీ పంజాబ్‌లో సత్తా చాటాలని పావులు కదుపుతోంది. ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.