Rahul Gandhi : సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్ర సర్కారు (Union Govt) పై, సీబీఎస్ఈ (CBSE) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సీబీఎస్ఈ లాభపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన విద్యార్థులతో ముచ్చటించిన వీడియోను సోమవారం ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఆ వీడియోలో ఏముందంటే.. ‘జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త. వారు సీబీఎస్ఈ కార్యాలయంలో తిష్ట వేశారు. సీబీఎస్ఈ పొరపాటు వల్ల మార్కులు తప్పుగా వస్తే.. దానికి బిల్లు మీపై పడుతుంది. అదెలాగంటే.. డిజిటల్ స్కాన్ కాపీ తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్‌కు రూ.100, ఒక పేపర్ రీటోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్ చేయించుకోవాలంటే ఒక ప్రశ్నకు రూ.25, మొత్తంగా ఒక విద్యార్థి తన జవాబుపత్రాన్ని సరిగా దిద్దించుకోవడానికి దాదాపు రూ.2000 చెల్లించాల్సి రావొచ్చు. నాలుగు లక్షల మంది విద్యార్థులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. CBSE ఎంత సొమ్ము ఆర్జిస్తోందో గమనించాలి. ఫోన్‌తో స్కాన్ చేస్తే తప్పులు రావడం ఖాయం. వాటిని సరిచేయడానికి అయ్యే ఖర్చు విద్యార్థులే చెల్లించాలి. తప్పు సీబీఎస్ఈది.. శిక్ష పడుతున్నది విద్యార్థులకు.. ఆదాయమేమో ప్రభుత్వానికి..! విద్య ఒక వ్యాపారంగా మారితే తప్పులు సరికాకపోగా రెట్టింపు అవుతాయి. సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు రూపంలో విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
సీబీఎస్ఈ టెండర్ నిబంధనలను మార్చేసిన ఫలితమే ఇదీ అని రాహుల్‌గాంధీ గతంలో కూడా విమర్శించారు. వాస్తవానికి 300 డీపీఐతో ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లను పరీక్ష పత్రాల స్కానింగ్‌కు వినియోగించాల్సి ఉండగా.. ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్ సాయంతో స్కాన్ చేసి తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు బాధితులుగా మారారని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా పరీక్షల నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన మరవకముందే కొద్ది రోజులుగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.