బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి. వారు తమ జీవిత కాలంలో అన్ని గంటలు వృథాగా నగరంలోని రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
నగరంలో 1.2 కోట్ల వాహనాలు ఉండటం వల్ల ప్రజల బాధలు అన్నీ ఇన్నీ కావని బీజేపీ ఎంఎల్సీ సీటీ రవి ఇటీవల పేర్కొనగా, నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తావించారు. 1.2 కోట్లే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే 40 లక్షల వాహనాలు కూడా ప్రజల ట్రాఫిక్ తలనొప్పికి కారణమవుతున్నాయని డీకే పేర్కొన్నారు.