బెంగళూరు: కొత్తగా పెళ్లైన జంట మధ్య రెండు నెలలకే విభేదాలు తలెత్తాయి. దీంతో హానీమూన్‌ను మధ్యలోనే ముగించుకున్నారు. ఆ జంట రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Newlywed Couple Dies By Suicide) ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సూరజ్ శివన్న, 26 ఏళ్ల గణవికి అక్టోబర్ 29న పెళ్లి జరిగింది. ఈ కొత్త జంట హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లింది. అయితే వారిద్దరి మధ్య గొడవ జరుగడంతో మధ్యలోనే బెంగళూరు తిరిగివచ్చారు.
కాగా, గణవి తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు. అత్త వారింట్లో తిరస్కరణ, అవమానాన్ని ఆమె ఎదుర్కొన్నట్లు వారు ఆరోపించారు. డిసెంబర్ 29న గణవి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రెయిన్ డెడ్‌గా డాక్టర్లు ప్రకటించారు. వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచి గణవికి చికిత్స అందించారు. డిసెంబర్ 25న ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు గణవి మరణంపై ఆమె కుటుంబం ఆందోళనకు దిగింది. వరకట్నం కోసం అత్తింటి కుటుంబం వేధించి ఆత్మహత్యకు పురికొల్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అత్తమామల ఇంటి ముందు నిరసన కూడా చేశారు. ఈ నేపథ్యంలో శివన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో శివన్న, తన తల్లి జయంతితో కలిసి బెంగళూరు నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వెళ్లాడు. డిసెంబర్ 27న హోటల్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివన్న తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది. శివన్న సోదరుడి సమాచారంతో స్థానిక పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. అతడి మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
మరోవైపు శివన్న తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న ఆమె ప్రాణాలతో పోరాడుతున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
4 dead due to brazier | వెచ్చదనం కోసం మంట రాజేసి నిద్రించిన కుటుంబం.. నలుగురు మృతి
Watch: రాత్రి వేళ స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెంటపడి వేధించిన ముగ్గురు