Bengalore | బెంగళూరు, ఏప్రిల్ 4 : ‘కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నన్ను క్రిమినల్‌గా చిత్రీకరించి, నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు నాపై రౌడీషీట్ తెరవడానికి ప్రయత్నించారు. ఈ అవమానాలు ఇంక భరించ లేను. నా చావుకు కాంగ్రెస్ నేతలే కారణం. వారి వేధింపుల కారణంగానే నేను ప్రాణం తీసుకుంటున్నా. నా చావు గుణపాఠం కావాలి’ అని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో సంచలనం కలిగించింది. దీనిపై డీసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తానని హోం మంత్రి పరమేశ్వర హామీనిచ్చారు. 35 ఏండ్ల వినయ్ సోమయ్య శుక్రవారం బెంగళూరులోని నగవార ప్రాంతంలోని తన ఆఫీస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు బీజేపీ సానుభూతిపరుడిగా గుర్తించారు. అతడి సూసైడ్ ప్రకారం.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, విరాజ్పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నన్నపై వినయ్ సోమయ్య రెండు నెలల క్రితం వాట్సాప్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కాంగ్రెస్ నేత మహీనా.. మడికేరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తనను కాంగ్రెస్ నేతలు రాజకీయంగా టార్గెట్ చేశారని, దీని కారణంగా తన కుటుంబం అనేక అవమానాలను ఎదుర్కొందని వినయ్ తెలిపాడు. తన సూసైడ్ నోట్లో పేర్కొన్న వారందరిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా, ఆ ఘటనపై డీసీపీతో దర్యాప్తు చేయిస్తానని హోం మంత్రి జీ పరమేశ్వర హామీనిచ్చారు.
మృతుని సోదరుడు జీవన్ కేఎస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెన్నూర్ పోలీసులు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్లో పొన్నన్న, మడికేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మంతర్ గౌడ పేర్లను ప్రస్తావించ లేదు.